ఖైరతాబాద్ గణపతి దర్శనానికి నేడే ఆఖరు..అందరికీ ఇవ్వడానికి 10 క్వింటాళ్ల ప్రసాదం సిద్ధం  

ఖైరతాబాద్ గణపతి దర్శనానికి నేడే ఆఖరు..అందరికీ ఇవ్వడానికి 10 క్వింటాళ్ల ప్రసాదం సిద్ధం  
  • మంగళవారం లక్ష మంది రాక  
  • బుధవారం 3  లక్షల మంది వస్తారని అంచనా

పంజాగుట్ట, వెలుగు:  ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి బుధవారమే లాస్ట్​అని నిర్వాహకులు ప్రకటించడంతో 9వ రోజు భక్తుల రద్దీ తీవ్రమైంది. నగరంతో పాటు మన, పక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు బడా గణేశుడిని చూసి తరించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు పొడవైన క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకోగా, విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన భక్త బృందానికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.  

నేటి అర్ధరాత్రి 12 గంటల వరకే..

సెప్టెంబర్ 25న నిమజ్జనం ఉండడంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకే స్వామి దర్శనానికి అనుమతించారు. నిమజ్జనానికి చేయాల్సిన ఏర్పాట్ల కోసం గురువారం దర్శనాలు నిలిపివేశారు. బుధవారం చివరి రోజు కావడంతో సుమారు మూడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ స్వామివారి ప్రసాదం అందేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అర్ధరాత్రి నుంచే సుమారు 10 క్వింటాళ్ల పులిహోర, శనగలు, దద్దోజన ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. 

పోలీసులు సిద్ధం 

పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే నిమజ్జన రూట్ మ్యాప్‌‌ను ఖరారు చేశారు. ఖైరతాబాద్ ఇన్‌‌స్పెక్టర్ వెంకటరెడ్డి, పంజాగుట్ట ఇన్‌‌స్పెక్టర్ జహాంగీర్ యాదవ్, ఏసీపీ మురళీకృష్ణలు ఫీల్డ్​లెవెల్​లో నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యేక పోలీస్ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.