పెండ్లి పేరిట మోసం ..సైబర్‌‌‌‌ నేరస్తుడిపై పీడీ యాక్ట్ 

పెండ్లి పేరిట మోసం ..సైబర్‌‌‌‌ నేరస్తుడిపై పీడీ యాక్ట్ 

గచ్చిబౌలి, వెలుగు: మ్యాట్రిమోనియల్ వెబ్‌‌సైట్లను వేదికగా చేసుకుని తాను విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నట్లు యువతులను నమ్మించి పెండ్లి పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాడిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామానికి  చెందిన మండా వెంకటకామేశ్‌‌ అలియాస్‌‌ కార్తీక్‌‌రెడ్డి(33) బీటెక్ చదివాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వివాహం కోసం సంబంధాలు వెతుకుతున్న యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు.

వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్‌‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్లను సృష్టించాడు. తాను ఎన్‌‌ఆర్‌‌ఐనని, ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తినని, మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించేవాడు. మ్యాట్రిమోనియల్ యాప్‌‌లు, వాట్సాప్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా బాధితులతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి, వివిధ అవసరాల పేరిట డబ్బులు బదిలీ చేయించుకునేవాడు. కొంతమంది క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతాలు, ఇతర రహస్య ఆర్థిక సమాచారాన్ని సేకరించి, ఆన్‌‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. 2021 నుంచి ఇప్పటివరకు కామేశ్‌‌19 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.