- మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 4 వేల మెగావాట్లకుగాను 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పవర్ ప్లాంట్‌కు జీ10, జీ11 క్వాలిటీ బొగ్గును ఇవ్వాల్సి ఉంటుందని, కానీ, జీ13, జీ14 క్వాలిటీ బొగ్గును ఇస్తున్నారని విమర్శించారు.
మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిందన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే బొగ్గు కొరత ఎందుకు ఏర్పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల కరెంట్ ఇస్తామన్నారని, తాము తొలివిడతలో 800 మెగావాట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరెంట్ తీసుకొచ్చామన్నారు.
సింగరేణి ప్లాంట్ ఇచ్చే కరెంట్ కాదని రాజస్థాన్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకున్నారన్నారు. ఇక్కడ డిమాండ్ ఉన్నా కూడా సింగరేణి కరెంట్‌ను రాజస్థాన్‌కు ఇవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రైతుల పంటలు ఎండబెట్టి ప్రభుత్వం వాళ్ల ఉసురు పోసుకుంటున్నదన్నారు.
