- 9వ రోజు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో తీవ్ర రద్దీ
- గణేశుని విగ్రహాలతో బారులుతీరిన నిర్వాహకులు
ముషీరాబాద్, వెలుగు: తొమ్మిదో రోజు హుస్సేన్‌సాగర్‌కు భారీ సంఖ్యలో గణనాథులు తరలిరావడం, క్రేన్ల సంఖ్య అందుకు అనుగుణంగా లేక మంగళవారం ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్ రోడ్ రోడ్లపై నిర్వాహకులు చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. భారీ టస్కర్లపై గణనాథులను తీసుకురావడంతో భారీ రద్దీ నెలకొంది. నెక్లెస్ రోడ్ వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. ఉదయమే మండపాల నుంచి బయలుదేరిన నిర్వాహకులు ట్రాఫిక్ రద్దీ కారణంగా సాయంత్రానికి నెక్లెస్ రోడ్‌కు చేరుకోగా.. అక్కడ కూడా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.
అంతా హుస్సేన్‌సాగర్‌కే...
హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నా..అక్కడక్కడా బేబీ పాండ్స్నిర్మించినా పలువురు మండపాల నిర్వాహకులు హుస్సేన్‌సాగర్ వైపే గణనాథులను తరలిస్తుండడంతో రద్దీ పెరిగింది. భారీ సంఖ్యలో విగ్రహాలు తరలివస్తున్నా.. వాటి సంఖ్యకు అనుగుణంగా నెక్లెస్ రోడ్ వద్ద నిమజ్జన క్రేన్లు అందుబాటులో లేవని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
