గుడ్ న్యూస్ : వచ్చే మూడు రోజులు కృష్ణా నదికి భారీగా నీళ్లు

గుడ్ న్యూస్ : వచ్చే మూడు రోజులు కృష్ణా నదికి భారీగా నీళ్లు

కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువన అప్పర్​ కృష్ణా, మిడిల్​ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండడంతో భారీగా ఇన్​ఫ్లోస్​వస్తున్నాయి. మరో ఆరు రోజుల పాటు ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో.. వరద ప్రవాహం మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మన ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వస్తున్నది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా వేగంగా నిండుతున్నది. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది.

కృష్ణా ప్రాజెక్టులకు వచ్చే మూడు రోజులు కూడా భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులకు లక్షన్నర క్యూసెక్కుల దాకా వరద వచ్చే చాన్సెస్​ ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద​వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తుంగభద్ర డ్యామ్​కు కూడా తొలిసారి లక్ష క్యూసెక్కుల ఫ్లడ్​వచ్చి చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల నుంచి 2.30 లక్షల క్యూసెక్కులకు ఇన్​ఫ్లోస్​ చేరుతాయని పేర్కొంటున్నారు. ఆ తర్వాత వరదలు కొంచెం తగ్గినా.. స్థిరంగా కొనసాగుతాయని చెబుతున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. మూడు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకుపైగా వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ వంద టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.93 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. బుధవారం నాటికి వరద ప్రవాహం 2 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో 197 టీఎంసీల జలాలుండగా.. ఈసారి మాత్రం వర్షాలు లేట్​గా పడడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టుకు ఆలస్యంగా నీళ్లొస్తున్నాయి.

ప్రస్తుతం 106.41 టీఎంసీల నీళ్లున్నాయి. జూరాల, శ్రీశైలానికి వరదలు వస్తున్నా.. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు మాత్రం వట్టిబోయి కనిపిస్తున్నది. ఈ ఏడాది ఇంకా వరద మొదలుకాకపోవడంతో.. ప్రస్తుతం నాగార్జునసాగర్​ డెడ్​స్టోరేజ్​ 131 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 137 టీఎంసీల జలాలున్నాయి. నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో 304 టీఎంసీల నిల్వ ఉండడం గమనార్హం. ఈ నెలాఖరు నాటికైనా సాగర్​కు వరదలు మొదలవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.