పెండింగ్ బిల్లులు చెల్లించాలి.. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ నేతల డిమాండ్

పెండింగ్ బిల్లులు చెల్లించాలి.. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు : 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్  బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా..  ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెండింగ్  బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్  చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు మంగళవారం వెళ్లిన మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్  మాట్లాడుతూ.. గతంలో శిల్పారామంలో జరిగిన రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సర్పంచుల గురించి ప్రస్తావిస్తూ సర్పంచులు తన ఇల్లు ముట్టడిస్తే.. వారికి టిఫిన్  చేయించి, టీ తాగించి పంపిస్తానని చెప్పారని గుర్తు చేశారు. 

సచివాలయంలో 5 సార్లు, సీఎం ఇంటి వద్ద 6 సార్లు ప్రయత్నించినా అపాయింట్‌‌మెంట్ ఇవ్వకపోగా పోలీసులను పెట్టి తమను వెళ్లగొట్టించి తీవ్రంగా అవమానించారని వాపోయారు. వర్షాకాలం ప్రారంభమైనా గ్రామాల్లో శానిటేషన్  పడకేసిందని, గతంలో మొక్కల పెంపకాన్ని, నర్సరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు పద్మా రెడ్డి, సానబోయిన సుధాకర్ గౌడ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.