మోడీకి సారీ చెప్పాలని 15 ఏళ్ల బాలికను బయపెట్టారు: రాహుల్ గాంధీ 

మోడీకి సారీ చెప్పాలని 15 ఏళ్ల బాలికను బయపెట్టారు: రాహుల్ గాంధీ 

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని 15 ఏళ్ల బాలికను బలవంత పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థుల ఇండ్లకు గుండాలను పంపి భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జెన్ జీ నిరసనకారులతో బుధవారం (ఆగస్ట్ 5) ఢిల్లీలో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత నిరసన.. వారిపై జరిగిన దాడి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యువతతో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలపై గళం విప్పుతున్న జెన్ జీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన మద్దతు ప్రకటించారు. 

నిరసనకారులను అణచివేయడానికి ప్రభుత్వం బలప్రయోగం, బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థుల ఇంటికి గుండాలను పంపించారని ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన 15 ఏళ్ల బాలికను కూడా బయపెట్టి బలవంతంగా ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జెన్ జీలు ఎలాంటి తప్పు చేయలేదని.. కేవలం తమకు జరిగిన అన్యాయంపై మాత్రమే పోరాటం చేశారని చెప్పారు. జెన్ జీలు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిరసనల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జెన్ జీ నిరసనకారులపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేశారని.. ఇప్పటికీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు. అన్యాయంపై పోరాడిన వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేశ భవిష్యత్ కు వెన్నుముకలైన విద్యార్థులు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులపై కేసులు ఎత్తివేయపోతే వారికి అండగా పోరాడుతామని హెచ్చరించారు.