AI రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అదానీ గ్రూప్ మరో కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఒడిశాలో భారీ AI డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే.. ఇది దేశంలోనే అతిపెద్ద AI ఆధారిత డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు 250 ఎకరాల భూమిని కేటాయించాలని అదానీ గ్రూప్ కోరింది.
1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్
ప్రతిపాదిత డేటా సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కాబోతోంది. ఈ స్థాయి ప్రాజెక్టు భారత్‌లో ప్రస్తుతం ప్రతిపాదిత గూగుల్ ఆంధ్రప్రదేశ్ AI డేటా సెంటర్ తర్వాత రెండో అతిపెద్ద AI డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. కటక్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన కేంద్రంగా పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు. భూమి లభ్యత, విద్యుత్ సరఫరా, నీటి వనరులు, రవాణా అనుసంధానం వంటి అంశాలను ఒడిశా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోంది.
ఒడిశాను AI హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం
సాంప్రదాయంగా గనులు, ఖనిజాలు, మెటల్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి చెందిన ఒడిశా ఇప్పుడు డిజిటల్ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, AI రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ డేటా సెంటర్, రాష్ట్ర ప్రభుత్వ నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్, జోహో, హెచ్‌సీఎల్‌టెక్ వంటి సంస్థల ప్రాజెక్టులు ఆ రాష్ట్రంలో పురోగతిలో ఉన్నాయి. అదానీ గ్రూప్‌కు ఇప్పటికే రూ.800 కోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందం కూడా ఉంది.
అదానీ లాంగ్‌టర్మ్ ప్లాన్స్..
ఈ ప్రతిపాదన అదానీ గ్రూప్ రూపొందించిన భారీ AI వ్యూహంలో భాగం. 2035 నాటికి దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచే హైపర్‌స్కేల్, AI-రెడీ డేటా సెంటర్ల నిర్మాణానికి 9లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. చెన్నైలో ఇప్పటికే డేటా సెంటర్ నిర్వహిస్తున్న అదానీ గ్రూప్.. ముంబై, పూణే, హైదరాబాద్‌లలో కొత్త కేంద్రాలను అభివృద్ధి చేస్తోంది. అలాగే విశాఖపట్నంలో గూగుల్‌తో కలిసి గిగావాట్ స్థాయి AI డేటా సెంటర్ క్యాంపస్, మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం, ఫ్లిప్‌కార్ట్ కోసం ప్రత్యేక AI డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తోంది.
ALSO READ : కోటి 75 లక్షలు శాలరీపై రూ.58 లక్షలు టాక్స్..
ప్రపంచవ్యాప్తంగా AI కంప్యూటింగ్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ డేటా సెంటర్ మార్కెట్ 2027 నాటికి 100 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో అదానీ ప్రతిపాదించిన రూ.లక్ష కోట్ల AI డేటా సెంటర్ ప్రాజెక్టు ఆమోదం పొందితే.. అది దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక పెట్టుబడులు, AI పరిశోధన, క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించే అవకాశముంది.
