మీరు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు: జెన్ జీలకు రాహుల్ సపోర్ట్

మీరు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు: జెన్ జీలకు రాహుల్ సపోర్ట్

న్యూఢిల్లీ: తమ సమస్యలపై గళం విప్పుతున్న జెన్ జీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం (ఆగస్ట్ 5) ఢిల్లీలో రాహుల్ గాంధీతో జెన్ జీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. జెన్ జీలు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశారని చెప్పారు. జెన్ జీలు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిరసనల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జెన్ జీ నిరసనకారులపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేశారని.. ఇప్పటికీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో పాల్గొన విద్యార్థుల ఇండ్లకు వెళ్లి బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు. 

అన్యాయంపై పోరాడిన వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేశ భవిష్యత్ కు వెన్నుముకలైన విద్యార్థులు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులపై కేసులు ఎత్తివేయపోతే వారికి అండగా పోరాడుతామని హెచ్చరించారు.