హైదరాబాద్సిటీ: యూటీఎఫ్ ఏర్పాటుకు ప్రపోజల్స్...మెరుగైన ప్రజా రవాణా కోసం HMDA వినూత్న ఆలోచన

హైదరాబాద్సిటీ: యూటీఎఫ్ ఏర్పాటుకు ప్రపోజల్స్...మెరుగైన ప్రజా రవాణా కోసం HMDA వినూత్న ఆలోచన
  •      స్టడీ చేసిన యూనిఫైడ్​మెట్రోపాలిటన్​ ట్రాన్స్​పోర్ట్​అథారిటీ
  •     ఈ అధ్యయనంపై సర్కారు ఆలోచిస్తోందంటున్న అధికారులు

హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో రానున్న రోజుల్లో పెరుగుతున్న జనాభా, వాహనాల నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా కోసం హెచ్ఎండీఏ వినూత్న ఆలోచన చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ఫండ్(యూటీఎఫ్) ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపింది. హెచ్ఎండీఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్​అథారిటీ(ఉమ్టా) నగరంలోని ప్రజా రవాణాపై అధ్యయనం చేసింది. సంబంధిత ప్రతిపాదనలు అమలులోకి వస్తే భవిష్యత్తులో అవసరమైన నిధులను సమకూర్చేందుకు యూటీఎఫ్​ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. 

ఉమ్టా అధ్యయనంపై సర్కారు ఆలోచిస్తోందని పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడం, ప్రజా రవాణాను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, ప్రజా రవాణాను ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలంటే నిధులు అవసరం అవుతాయి. కాబట్టి యూటీఎఫ్ ఏర్పాటైతే ప్రభుత్వంపై పెద్ద భారం లేకుండానే ఈ ప్రత్యేక నిధులను ప్రజా రవాణాకు వినియోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

నిధులు ఎలా సేకరిస్తారంటే..

హెచ్ఎండీఏ ఏర్పాటు చేసే యూటీఎఫ్ కు నిధులను సమకూర్చేందుకు అవసరమైన మార్గాలను ఉమ్టా అధికారులు అన్వేషిస్తున్నారు. నగరంలో రోజుకు దాదాపు 4 వేల నుంచి 5 వేల వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. వాటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. ఇందులో నుంచి కొంత మొత్తాన్ని సెస్​రూపంలో యూటీఎఫ్ కు తరలించాలని ప్రతిపాదనలు చేశారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సమస్య కాబోదని అంటున్నారు. అలాగే, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సర్కారు విధిస్తున్న పన్నుల్లో కొంత యూటీఎఫ్ కు  తరలించాలన్న అంశం కూడా ప్రపోజల్స్​లో ఉంది. ఇక, హెచ్ఎండీఏ చట్టం ప్రకారం.. నగరంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో హెచ్ఎండీఏ కు 1.25 శాతం డెవలప్​మెంట్ ఫండ్ కింద చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు. తాజాగా దాన్ని అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. 

ఇలా వచ్చే నిధులతో ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయవచ్చని అధికారులు తెలిపారు. దేశంలోని కొన్ని నగరాల్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్(సీబీడీ)లు ఉన్నాయి. ఆయా జోన్లలో వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్​లోని సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్​సిటీ, అమీర్​పేట, అబిడ్స్ వంటి ప్రాంతాలను సీబీడీలుగా ప్రకటించి, నిర్ణీత సమయాల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రైవేట్ వెహికిల్స్ నుంచి సెస్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేసే విషయంపైనా ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం

హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు అవసరమని అధికారులు అంటున్నారు. ప్రజా రవాణా వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే నగర ప్రజల అవసరాలను అనుగుణంగా కావాల్సిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.