ఆలయంలో మండపం కూలి ఐదుగురు మృతి.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

ఆలయంలో మండపం కూలి ఐదుగురు మృతి.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

పర్భనీ: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పర్భనీ జిల్లా యశ్వాడి గ్రామంలోని హనుమాన్ ఆలయ గర్భగుడి ముందు భాగంలో మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మరణించగా, మరో 25 మంది శిథిలాల కింద చిక్కుకోగా వారిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. 

పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో స్లాబ్ శిథిలాలతోపాటు స్లాబ్ వేసేందుకు అమర్చిన కర్రలు, చెక్కలు, ఇతర వస్తువులు భక్తులపై పడిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం పర్భనీ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

 ‘‘ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వాడి గ్రామంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయ సభా-మండపం(బయటి హాలు) స్లాబ్ కూలిపోయింది. పోలీసు, జిల్లా యంత్రాంగం వెంటనే తమ బృందాలను పంపించాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని ఒక పోలీసు అధికారి ‘పీటీఐ’ వార్తా సంస్థకు తెలిపారు.