బేడీలు తెంచుకున్న బెంగాల్..బార్డర్ ఫెన్సింగ్ వేగవంతం.. అవినీతిపై ఉక్కుపాదం: ప్రధాని మోదీ

బేడీలు తెంచుకున్న బెంగాల్..బార్డర్ ఫెన్సింగ్ వేగవంతం.. అవినీతిపై ఉక్కుపాదం: ప్రధాని మోదీ
  • పూర్వవైభవం దిశగా రాష్ట్రం అడుగులు: మోదీ
  • బార్డర్ ఫెన్సింగ్ వేగవంతం.. అవినీతిపై ఉక్కుపాదం 
  • ఒక్క ఓటు తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రధాని 
  • బంగ దివస్ వేడుకలకు హాజరు 
  • రూ. 18,880 కోట్ల పీఎం-కిసాన్ నిధులు విడుదల

తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సంకెళ్లను తెంచుకుని సరికొత్త అభివృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు తమ ఒక్క ఓటు ద్వారా తెచ్చిన ఈ మార్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. శనివారం పశ్చిమ బెంగాల్‌‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌‌ సిటీ‌‌లో రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం పశ్చిమ బంగ దివస్(పశ్చిమ బెంగాల్ అవతరణ దినోత్సవం) వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పుడు బెంగాల్ గాలిలోనే ఒక కొత్త తాజాదనం కనిపిస్తోంది. బెంగాల్ తన సంకెళ్లను తెంచుకుందని, దానికి పూర్వవైభవం తిరిగి రావడం ప్రారంభమైందని అనిపిస్తోంది’’ అని ప్రధాని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ మార్పు ప్రజాస్వామ్య ప్రక్రియ శక్తికి నిదర్శనమని చెప్పారు. ‘‘బెంగాల్ ప్రజల ముఖాల్లో ఒక వెలుగు, గ్రామాల్లో ఆనందం, నమ్మకం కనిపిస్తున్నాయి. మీ ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో బెంగాల్‌‌లో స్పష్టంగా అర్థమవుతోంది’’ అని అన్నారు.

 భారత్-– బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఫెన్సింగ్ (కంచె) పనులను వేగవంతం చేయడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రక్రియను అడ్డుకుందని ఆరోపించారు.‘‘సరిహద్దు కంచె నిర్మాణానికి భూమిని బదిలీ చేసే ప్రక్రియను గత ప్రభుత్వం ఎలా నిలిపివేసిందో మీరు చూశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ పనులు ఊపందుకున్నాయి’’ అని పీఎం పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారిపై, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. 

దేశ విభజన సమయంలో బెంగాల్‌‌లోని ఒక భాగం భారతదేశంలోనే ఉండేలా చేయడంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. పశ్చిమ బంగ దివస్ ప్రాముఖ్యతను నేటి యువత తెలుసుకోవాలని సూచించారు.

23వ విడత పీఎం -కిసాన్ నిధులు విడుదల..  

తారకేశ్వర్‌‌లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు సీఎం సువేందు అధికారి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు పీఎం -కిసాన్ పథకం కింద 23వ విడతగా రూ. 18,880 కోట్ల నిధులను విడుదల చేశారు. దీనితో పాటు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం), ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన వంటి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. ఫసల్ బీమా యోజన ప్రయోజనాలను ఇకపై పశ్చిమ బెంగాల్ రైతులకు కూడా వర్తింపజేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.