నా ఆస్తులన్నీ పనిమనిషికే.. నటుడు రంగనాథ్ చివరి కోరిక వెనుక దిగ్భ్రాంతికర నిజాలు!

నా ఆస్తులన్నీ పనిమనిషికే.. నటుడు రంగనాథ్ చివరి కోరిక వెనుక దిగ్భ్రాంతికర నిజాలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సీనియర్ నటుడు రంగనాథ్. దాదాపు 300 సినిమాల్లో నటించి మెప్పించారు. రంగనాథ్ జీవితం ఎంత గొప్పదో.. ఆయన చివరి కోరిక కూడా అంతే సంచలనం.  2015 డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన మరణం కంటే, చివరిగా రాసి వెళ్లిన సందేశమే అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం .. తన ఇంటి గోడపై నల్ల మార్కర్‌తో ఇవన్నీ ఆమెకే ఇవ్వండి... ఆమెను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ రాసిన రంగనాథ్.. తన ఆస్తులు, పొదుపుల వివరాలను కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఆ సందేశం ఆయన ఇంట్లో ఆరు సంవత్సరాలకు పైగా సేవలందించిన పని మనిషి మీనాక్షిని ఉద్దేశించిందేనని వార్తలు వచ్చాయి. ఆ రోజు కూడా ఆమె ఆయనకు భోజనం వండి వెళ్లిపోయిందని, ఆ తర్వాత జరిగిన విషాదం గురించి తెలియదని చెబుతారు.

అయితే సాయంత్రం రంగనాథ్ కుమార్తె నీరజ ఇంటికి వచ్చి పలుమార్లు తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా ఆయన మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరణానికి కొద్దిసేపటి ముందు తన స్నేహితుడు బి. దేవదాస్‌కు గుడ్‌బై అంటూ ఒక ఎస్ఎంఎస్ పంపినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.  అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు.

రంగనాథ్ భార్య 2009లో మరణించిన తర్వాత ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు పలుమార్లు వెల్లడించారు. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేని క్లిష్ట సమయంలో ఆయనకు ఒక కుటుంబ సభ్యురాలిలా అండగా నిలిచింది వారి ఇంట్లో పనిమనిషి మీనాక్షి . దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఆమె ఆయనను ఎంతో శ్రద్ధగా చూసుకోవడంతో, ఆమెపై రంగనాథ్‌కు అపారమైన నమ్మకం, అభిమానంతో పాటు కృతజ్ఞత కూడా పెరిగింది.

అందుకే తన మరణానంతరం తన వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని మీనాక్షికే ఇవ్వాలని రంగనాథ్ తన చివరి కోరికగా వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఆయన కుమారుడు టి. నాగేంద్ర కుమార్ కూడా కుటుంబం ఆ కోరికను గౌరవిస్తామని..ఆమె ఆరు సంవత్సరాలుగా మా కుటుంబంతో ఉంది. నాన్నగారి కోరిక ప్రకారం ఆయన పొదుపు మొత్తాన్ని ఆమెకే ఇస్తాం అని ప్రకటించారు. కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు  ప్రశంసించారు.

రైల్వే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన రంగనాథ్, 'బుద్ధిమంతుడు' (1969) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. దాదాపు 46 ఏళ్ల సినీ ప్రయాణంలో 300కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేశారు. జమీందారుగారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, ఖైదీ, మన్మథుడు, నిజం, కలిసుందాం రా, 3 దీవారేన్ వంటి చిత్రాలు ఆయన నటనకు నిదర్శనంగా నిలిచాయి. చివరి క్షణాల్లో తనకు అండగా నిలిచిన వ్యక్తిని మరువకుండా తన సంపాదనను ఆమెకే ఇవ్వాలని కోరుకోవడం, ఆయన కృతజ్ఞతాభావానికి నిదర్శనంగా నేటికీ అభిమానులు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు..