ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రీఛార్జ్ బిల్లు మరింత పెరగనుంది. ఇన్నాళ్లూ అందుబాటులో ఉంచిన, ఎక్కువ మంది కస్టమర్లు రీఛార్జ్ చేసుకుంటున్న 299 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్కు ఎయిర్ టెల్ చడీచప్పుడు కాకుండా మంగళం పాడేసింది. ఎయిర్ టెల్ యూజర్లకు ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న 299 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 1జీబీ 5G డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ సదుపాయంతో అందుబాటులో ఉండేది. ఉన్నట్టుండి ఈ ప్లాన్ మాయమైంది.
ఈ ప్లాన్ స్థానంలో 349 రూపాయల ప్లాన్ను ఎయిర్ టెల్ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై.. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 299 రూపాయల ప్లాన్ను మర్చిపోవాల్సిందే. హైదరాబాద్లో ఉంటున్న ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా ఇకపై.. రోజుకు కొంత మొత్తంలో 28 రోజుల పాటు వాయిస్ కాల్స్తో పాటు అపరిమిత డేటా కావాలంటే 349 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాల్సిందే.
349 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ 5జీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పంపించే వెసులుబాటు ఉంది. అపరిమితే డేటా పెద్దగా వాడే అవసరం తమకు లేదని, వాయిస్ కాల్స్ మాత్రమే చాలనుకునే కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీతో 2 జీబీ డేటాతో 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.
219 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, 3జీబీ డేటా పొందొచ్చు. ఈ నెల వారీ రీఛార్జ్ తలపోటు తమకు వద్దనుకునే కస్టమర్లు.. 365 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్తో 2వేల 2వందల 49 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
