దేశంలోని అత్యంత రహస్యంగా పనిచేసే క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థల్లో ఒకటైన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 2 నెలల ఇంటర్న్‌షిప్‌కే ఏకంగా రూ.57 లక్షల వరకు స్టైపెండ్ అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. భారతదేశంలోని అత్యధికంగా చెల్లించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
మ్యాథమ్యాటిక్స్, ప్రోగ్రామింగ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్‌లో టాలెంట్ ఉన్న దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా గ్రావిటన్ ఈ భారీ ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. 2 నెలల కాలానికి అందించే ఈ మొత్తం నెలకు సుమారు రూ.28.5 లక్షల ఆదాయానికి సమానం కావడం విశేషం.
ఈ ఇంటర్న్‌షిప్‌లో సెలక్ట్ అయిన విద్యార్థులు కేవలం ట్రైనింగ్ మాత్రమే పొందరు. గ్రావిటన్‌లోని క్వాంట్ రీసెర్చర్లు, ట్రేడర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో కలిసి లైవ్ ట్రేడింగ్ వ్యవస్థలపై పనిచేసే అవకాశం పొందుతారు. మార్కెట్ డేటాను విశ్లేషించడం, భారీ స్థాయిలో డేటా ప్రాసెసింగ్ చేయడం, స్పీడ్, సామర్థ్యం, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఉన్న ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేయడం వంటి కీలక పనుల్లో భాగస్వాములు అవుతారు.
ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఉపయోగించే ప్రొడక్షన్-గ్రేడ్ సిస్టమ్‌లను రూపొందించే అవకాశం ఈ ఇంటర్న్‌లకు లభించనుంది. ట్రేడింగ్‌లో ప్రతి మిల్లీసెకన్ కూడా కీలకమైన పరిస్థితుల్లో.. వేగవంతమైన అల్గారిథమ్‌లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే టీంతో కలిసి పనిచేయడం ఈ ఇంటర్న్‌షిప్ ప్రత్యేకత. ఈ ఇంటర్న్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి భవిష్యత్తులో గ్రావిటన్‌లో పూర్తి స్థాయి రీసెర్చ్ లేదా ఇంజినీరింగ్ ఉద్యోగాలకు అవకాశం కూడా లభించవచ్చని సంస్థ తెలిపింది.
ALSO READ : ట్రంప్ ఎఫెక్ట్ : అమెరికాలో రోడ్డున పడిన 15 వేల మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు
భారీ శాలరీతో టెక్ రంగంలో టాలెంట్ ను ఆకర్షించే పోటీ పెరుగుతున్న వేళ, ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రావిటన్ ఇచ్చిన రూ.57 లక్షల ఇంటర్న్‌షిప్ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఉన్న యువ ఇంజనీర్లకు ఇది కెరీర్‌ను మలుపుతిప్పే అవకాశంగా నిలుస్తోంది.
