న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం ప్రభుత్వం యోచిస్తోన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోన్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ కోసం ఆగస్ట్ 16, 17, 18వ తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆగస్ట్ 13వ తేదీతో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ భావించింది.
కానీ నీట్ పేపర్ లీక్, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, విద్యార్థులపై పోలీసుల బల ప్రయోగంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభ సజావుగా సాగడం లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. దీంతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రభుత్వం సభలో టేబుల్ చేసే వీలు లేకుండా పోయింది.
కానీ డీలిమిటేషన్ బిల్లు విషయంలో మోడీ సర్కార్ వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహారిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 13న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ కోసం ప్రత్యేక సెషన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వర్షకాల సమావేశాల తర్వాత పార్లమెంట్‌ను ప్రొరొగ్ చేయకుండా ఆగస్ట్ 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ : క్షమాపణలు చెప్పండి లేదా చర్యలు తీసుకోండి..
స్పెషల్ సెషన్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు కేంద్రం కృషి చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మోడీ సర్కార్ రెండో ప్రయత్నం:
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో మోడీ సర్కార్‌కు గతంలోనే ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం, 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడానికి ఉద్దేశించి 2026, ఏప్రిల్‌లో లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లు ఆమోదం పొందటానికి కావాల్సిన మూడింట రెండింతల మెజార్టీ రాకపోవడంతో బిల్లు రిజెక్ట్ అయ్యింది.
ఈ బిల్లుపై లోక్ సభలో మొత్తం 528మంది ఎంపీలు ఓట్లు వేశారు. అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే అనుకూలంగా 358 ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్‌కు 54 ఓట్లు తగ్గాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. కానీ ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా 131 రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్ కు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయితే మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.
