ఆదివాసీలకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తం.. రెండున్నర లక్షల జీతంతో ఉద్యోగాలు: మంత్రి వివేక్

ఆదివాసీలకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తం.. రెండున్నర లక్షల జీతంతో ఉద్యోగాలు: మంత్రి వివేక్

మంచిర్యాల: 2026, ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. అర్హులందరికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 1000 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 

జర్మన్ భాష నేర్చుకొని మన యువత విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం (ఆగస్ట్ 5) చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో కొమురం భీమ్ విగ్రహాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన పోరాట ప్రతిమ, వీరుడు కొమురం భీమ్ అని కొనియాడారు.

సొంత నిధులతో కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న స్థానిక యువతను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఆదివాసీలలో చదువుకునే వారు పెరుగుతున్నారని.. విద్యే మనకు అతిపెద్ద బలమని అన్నారు. ఆదివాసీ యువతకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తామన్నారు. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే విదేశాల్లో 2.5 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. స్కిల్ నేర్చుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కొమురం భీం లాగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఎవరైనా కొమురం భీం విగ్రహం పెట్టుకుంటానని ముందుకొస్తే ఆర్ధిక సహయం చేస్తామనని మాట ఇచ్చారు. ఆదివాసీ వర్గాల వారికి ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని భూమి అడిగితే వెంటనే ఎమ్మార్వోకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.