లక్నో: బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని ఆమె పని చేస్తోన్న స్కూల్లోనే పిల్లల ముందే కాల్చి చంపాడు ప్రియుడు. ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిషాత్ ఫాతిమా అనే 26 ఏళ్ల యువతి లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. మహమ్మద్ సౌద్ అనే యువకుడితో ఫాతిమా ప్రేమాయాణం నడిపింది.
మనస్పర్ధాలు రావడంతో ఇటీవల మహమ్మద్‌కు బ్రేకప్ చెప్పింది ఫాతిమా. ప్రియురాలు వదిలేయడాన్ని తట్టుకోలేకపోయిన మహమ్మద్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం (సెప్టెంబర్ 21) ఫాతిమా పని చేస్తోన్న పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ఇరువురి మధ్య ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహమ్మద్ వెంట తీసుకెళ్లిన తుపాకీతో స్కూల్‌లో పిల్లల ముందే ప్రియురాలిని తలపై కాల్చాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ షాకింగ్ ఘటనతో విద్యార్థులతో పాటు స్కూల్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
