అమెరికాలో పంద్రాగస్టు వేడుకలు.. మసాచూసెట్స్ గవర్నర్ ప్రకటన

అమెరికాలో పంద్రాగస్టు వేడుకలు.. మసాచూసెట్స్ గవర్నర్ ప్రకటన

ఆగస్టు 15న ఇండియాడే వేడుకలు 

వాషింగ్టన్: భారత స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రం అధికారిక గుర్తింపు కల్పించింది. ఏటా ఆగస్టు 15 న ‘ఇండియా డే’ పేరుతో వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు మసాచూసెట్స్ రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలే పేర్కొన్నారు. 

1947 లో బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన చరిత్రాత్మక క్షణాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన క్షణాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 న ఇండియా తన 79వ వార్షికోత్సవం జరుపుకుంటోందని గవర్నర్ పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసులలో భారత సంతతి ప్రజలే ఎక్కువని, దాదాపు 3.6 కోట్ల మంది ఇండియన్లు వివిధ దేశాల్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఒక్క అమెరికాలోనే దాదాపు 50 లక్షలకు పైగా భారత సంతతి ప్రజలు ఉన్నారని, అమెరికా అభివృద్ధికి, సామాజిక, ఆర్థిక, పౌర వికాసానికి కృషి చేస్తున్నారని మౌరా హీలే కొనియాడారు. బోస్టన్ మేయర్ మిచెల్ వూ కూడా ఇదే విధమైన ప్రకటనను జారీ చేశారు.