IPL స్పాన్సర్‌గా ఉంటే కష్టాలేనా?.. అప్పట్లో DLF, Pepsi, Vivo, Dream11.. ఇప్పుడు Tata!

IPL స్పాన్సర్‌గా ఉంటే కష్టాలేనా?.. అప్పట్లో DLF, Pepsi, Vivo, Dream11.. ఇప్పుడు Tata!

IPL Sponsor Curse: ఐపీఎల్ (IPL) టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకోవడం అంటే వేల కోట్ల ప్రచారం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది. కానీ, ఈ టైటిల్ స్పాన్సర్‌షిప్ సాధించిన కంపెనీలకు ఒక శాపం (IPL Sponsor Curse) చుట్టుముడుతోందా? అంటే అవుననే చెప్పాలి.. ఎందుకంటే, క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా కొనసాగుతుంది. గతంలో ఐపీఎల్ స్పాన్సర్లుగా ఉన్న డీఎల్ఎఫ్, పెప్సీ, వివో, డ్రీమ్11 వరుసగా సంక్షోభాల్లో చిక్కుకోగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ (Tata Group) వచ్చి చేరింది.

టాటా గ్రూప్‌కి భారీ నష్టాలు.. బోర్డులో రచ్చ: 

2022 నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న టాటా గ్రూప్, ఇటీవల తమ ఒప్పందాన్ని 2028 వరకు పొడిగించుకుంది. కానీ, ప్రస్తుతం ఈ గ్రూప్ తీవ్ర ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. FY26లో టాటా సన్స్ నికర లాభం 35.7 శాతం తగ్గి రూ. 17,923 కోట్లకు పడిపోయింది. ఎయిర్ ఇండియా నష్టం గతంలో కంటే రెట్టింపై ఏకంగా ₹22,238 కోట్లకు చేరింది. దీనికి తోడు టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్, ఆగ్రటాస్ బిజినెస్‌లలో వచ్చిన నష్టాలు గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి.

అంతర్గత ఆధిపత్య పోరు: 

ఎన్ చంద్రశేఖరన్‌ను మరో 5 ఏళ్లు ఛైర్మన్‌గా కొనసాగించడం, కంపెనీని ఐపీఓ (IPO)కి తీసుకెళ్లడంపై టాటా సన్స్ బోర్డు ఇంట్రెస్ట్ చూపించగా, 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో అంతర్గత రచ్చ స్టార్ట్ అయింది. 
 
ఈ కంపెనీలకూ కష్టాలు తప్పలేదు: 

* డీఎల్ఎఫ్ (2008-2012): ఐపీఎల్ తొలి టైటిల్ స్పాన్సర్ అయిన ఈ రియల్ ఎస్టేట్ సంస్థ, అప్పులు పెరిగిపోవడం, సేల్స్ పడిపోవడంతో స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది.

* పెప్సీ (2013-2015): ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నప్పటికీ, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదాల కారణంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని భావించి డీల్‌ను మధ్యలోనే క్యాన్సిల్ చేసుకుంది. 

* వివో (2016-2021): చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం, 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలతో తాత్కాలికంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022లో టాటాకు హ్యాండోవర్ చేసింది.

* డ్రీమ్11 (2020): వివో స్థానంలో 2020 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వచ్చింది. ఆ తర్వాత టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న సమయంలో భారత్ ప్రభుత్వం రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ పై నిషేధం విధించే చట్టం తీసుకురావడంతో జాతీయ జట్టు స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్11 తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

* ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ వల్లే ఈ సమస్యలు వచ్చాయని చెప్పలేనప్పటికీ, ఆ స్థానంలోకి వచ్చిన ప్రతి బ్రాండ్ ఏదో ఒక పెద్ద వివాదంలో లేదా నష్టాల్లో చిక్కుకోవడం ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ బిజినెస్ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది.