హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పబ్లిక్ వినాయక విగ్రహాల నిమజ్జనాల్లో బిజీగా ఉన్నారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, RC పురం, పటాన్ చెరు, BHEL.. ఏరియాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ సిటీలో వాన దంచికొట్టింది.
శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 6.3 సెంటీమీటర్లు, ఎయిర్‌పోర్టు 6, శివరాంపల్లిలో 4.5, రాజేంద్రనగర్‌లో 4.5, మైలార్‌దేవ్‌పల్లిలో 4.1, తట్టిఅన్నారంలో 3.9, రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ వద్ద 3.8, షేక్‌పేటలో 3.1, మధురానగర్‌లో 3.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 25 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ మేరకు నాలుగు రోజులకు ఐఎండీ ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
ALSO READ : తెలంగాణలో వారం రోజులు వానలే వానలు..
సెప్టెంబర్ 20, 21వ తేదీల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ.. ఈ రెండు రోజులకు ఎల్లో అలర్ట్ను ఇష్యూ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇన్నాళ్లూ వర్షాల్లేక ఎండల తీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు.. వర్షాలు కొంచెం ఊరటనిచ్చాయి. ఇటు పంటల తడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కొంత మేలు చేయనున్నాయి.
