తెలంగాణలో TRS అధికారంలోకి వస్తే ఫ్రీ విద్య, వైద్యం: కవిత

తెలంగాణలో TRS అధికారంలోకి వస్తే ఫ్రీ విద్య, వైద్యం: కవిత

హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన (TRS) అధికారంలో వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని పార్టీ చీఫ్ కవిత ప్రకటించారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు అయిన ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 20) కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో  పాంచజన్య శంఖరావం పేరుతో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. 

పార్టీ చీఫ్ కవిత ఈ సభకు హాజరై ప్రసగించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా అని ప్రశ్నించారు. ఓవైపు ఎల్ నినో పరిస్థితులు మరోవైపు భూగర్భ జలాలు ఎండిపోవడంతో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

►ALSO READ | ఎల్‌నినో కంటే డేంజర్‌గా రేవంత్ రెడ్డి మారిండు: హరీష్రావు

నీళ్లు, ఎరువులు, కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు నీళ్లు ఇచ్చే ఆలోచన లేదని ఆరోపించారు. నీళ్లు, యూరియా, పండించిన ధాన్యం కొనుగోలు కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకోవాల్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.