వర్షాలు పడొద్దని అఘోరాలతో హరీశ్ తంత్ర పూజలు

వర్షాలు పడొద్దని అఘోరాలతో  హరీశ్ తంత్ర పూజలు
  •     రాష్ట్రంపై కక్షతోనే తమిళనాడు, కర్నాటక పర్యటనలు
  •     తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వర్షాలు కురవకూడదని, కరువుతో ప్రజలు అల్లకల్లోలమై ప్రభుత్వానికి వ్యతిరేకం కావాలనే దుర్బుద్ధితో బీఆర్‌‌‌‌ఎస్ నేత హరీశ్‌‌‌‌రావు క్షుద్రపూజలు చేయించారని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి ఆరోపించారు.తమిళనాడులోని తిరుచ్చి, కర్నాటకలోని శివమొగ్గ అఘోరా ఆలయాల్లో హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారని తెలిపారు. 

ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఎంపీ బలరాం నాయక్‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 2, మే 30, జులై 2వ తేదీల్లో ఆయన ఈ దేవాలయాలకు వెళ్లి వచ్చిన ఆధారాలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి తన నిజాయతీని నిరూపించుకోవాలని, లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్‌‌‌‌ఎస్ నేతల దుష్ట పూజల వినాశకర ప్రభావం నుంచి తెలంగాణను కాపాడటానికి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రభుత్వం తరఫున నాగార్జున సాగర్ వద్ద జల యజ్ఞం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల చివరి వారంలో గానీ, వచ్చే నెల రెండో వారంలో గానీ ఈ యాగాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.  

 ప్రజాసేవలో ఉండి క్షుద్రపూజలు దుర్మార్గం :  బలరాం నాయక్

ప్రజాసేవలో ఉండి ప్రజలకు నష్టం కలిగించేలా క్షుద్ర పూజలు చేయించడం దుర్మార్గమని ఎంపీ బలరాం నాయక్ విమర్శించారు. పీఠాలు, పూజలపై ఎవరికైనా వ్యక్తిగత నమ్మకాలు ఉండొచ్చని, అయితే సమాజానికి హాని తలపెట్టేలా వాటిని ప్రయోగించడం సరికాదని హితవు పలికారు. ఒక పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఇటువంటి పనులకు ఒడిగట్టడం విచిత్రంగా ఉందని తెలిపారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని, నోటీసులు పంపిస్తామని బెదిరించడం సరికాదని చెప్పారు. బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కేసులు పెడితే ప్రతి ఊరిలోనూ ఎదురు కేసులు పెడతామని, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు.