- రాహుల్ గాంధీని భవిష్యత్తు తరాలు క్షమించవు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన వారికి మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యవహరించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ క్షమించవని, ఆయన వ్యాఖ్యలను దేశ ప్రజలు, నేటి తరం తీవ్రంగా చీదరించుకుంటున్నారని స్పష్టం చేశారు. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా వ్యవహరించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
అందుకే దేశ ప్రజలు, యువత ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్నారని బుధవారం కేంద్రమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు పెద్దలు వారిని సరిదిద్దాలే తప్ప, నోటికొచ్చినట్టు మాట్లాడే వారిని సమర్థించడం సరైన పద్ధతి కాదన్నారు. ‘రాహుల్ గాంధీ కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టినా, దుర్భాషలాడినా వారు ఇలాగే సమర్థిస్తారా? సొంత తల్లిని అన్ని మాటలు అన్నా కూడా ప్రధాని మోదీ పెద్దమనసుతో స్పందించారు. తప్పు చేసిన వారిని క్షమించి, సరైన దారిలో పెట్టే గుణమే భారతీయ నాగరికతకు, సంస్కృతికి నిదర్శనం. తప్పు తెలుసుకుని ఒక విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెబితే, రాహుల్ గాంధీ ఎందుకు అసహనానికి గురవుతున్నారు’ అని కిషన్రెడ్డి నిలదీశారు.
