గ్లోబల్ సమిట్‌‌కు  యంగ్ ఇండియా  బిల్డింగులు వాడుకోండి

గ్లోబల్ సమిట్‌‌కు  యంగ్ ఇండియా  బిల్డింగులు వాడుకోండి

సీఎస్​  హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్–2026 గ్లోబల్ సమిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. గ్లోబల్​సమిట్‌‌కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన సముదాయాలను సమిట్‌‌కు వినియోగించుకోవాలని సూచించారు. రోడ్లు, కరెంట్, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను వీలైనంత తొందరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

బుధవారంసెక్రటేరియెట్‌‌లో  అధికారులతో ఆయన రివ్యూ చేశారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం అత్యంత అవసరమన్నారు. తెలంగాణను అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్- అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్ర టరీ కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.