రైతు డిస్కమ్పై హైలెవల్ కమిటీ.. చైర్మన్గా సీఎస్, సభ్యులుగా ఎనర్జీ, ఫైనాన్స్, లా సెక్రటరీలు

రైతు డిస్కమ్పై హైలెవల్ కమిటీ.. చైర్మన్గా సీఎస్, సభ్యులుగా ఎనర్జీ, ఫైనాన్స్, లా సెక్రటరీలు
  •  ట్రాన్స్​కో, మూడు డిస్కమ్‌‌ల సీఎండీలకూ మెంబర్లుగా చాన్స్
  •  ఆస్తులు, అప్పులు, అధికారాలు, ఉద్యోగుల బదలాయింపుపై సర్కారుకు నివేదిక

హైదరాబాద్, వెలుగు:  రైతు డిస్కమ్​పై ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ అధ్యక్షతన ప్రభుత్వం హై లెవల్​ కమిటీ వేసింది.  సభ్యులుగా ఎనర్జీ, ఫైనాన్స్​, లా సెక్రటరీలు, ట్రాన్స్​కోతో పాటు సదరన్, నార్తర్న్, రైతు డిస్కమ్​ సీఎండీలను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్​ జాజు జీవో నంబర్​ 21 విడుదల చేశారు.

తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్​ లిమిటెడ్ (టీజీఆర్​పీడీసీఎల్) కార్యాచరణ కోసం ఆస్తులు, అప్పులు, మానవవనరులు, నెట్​వర్క్, పీపీఏలపై అధ్యయనం చేసి బదలాయింపునకు సంబంధించి సర్కారుకు నివేదిక ఇవ్వనున్నట్టు సీఎస్​తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్​ అందించే సర్వీస్​ కనెక్షన్లతో పాటు నీటి పారుదల శాఖ, హైదరాబాద్​ జలమండలి, మిషన్​ భగీరథకు సంబంధించిన  సుమారు 30 లక్షల విద్యుత్​ కనెక్షన్లను రైతు డిస్కమ్ లోకి మార్చుతూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

కంపెనీల చట్టం ప్రకారం రైతు డిస్కమ్​కు సీఎండీతో పాటు డైరెక్టర్లను నియమించింది. ప్రభుత్వ షేర్లను ప్రకటించింది. తెలంగాణ ఈఆర్​సీ సైతం ఇటీవల రైతు డిస్కమ్​కు లైసెన్స్​ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రైతు డిస్కమ్​ సేవలు అధికారికంగా ప్రారంభించడానికి గతంలో ఎనర్జీ శాఖ పరిధిలోని వివిధ డిస్కమ్​లు, ట్రాన్స్​కో పరిధిలో ఉన్న ఆస్తులు, అప్పులు, మానవ వనరుల విభజన వంటి వాటిని పారదర్శకంగా చేపట్టే బాధ్యతలను ఈ ఉన్నత స్థాయి కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది.