నిషేధిత జాబితా పేరుతో అర్హులకు అన్యాయం జరగనియ్యం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిషేధిత జాబితా పేరుతో అర్హులకు అన్యాయం జరగనియ్యం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     మా సర్కారు వచ్చాక ఒక్క సెంటు భూమిని కూడా ఆ జాబితాలో చేర్చలే: మంత్రి పొంగులేటి
  •     22ఏ లిస్ట్​పై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు


హైదరాబాద్ , వెలుగు:  నిషేధిత జాబితా పేరుతో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘‘అర్హులైన వారి హక్కులను కాపాడుతాం.. అదే సమయంలో ప్రభుత్వ భూములను రక్షిస్తాం’’  అని స్పష్టంచేశారు. ఈ  రెండు లక్ష్యాలతో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. 22 ఏ నిషేధిత జాబితాలో గతంలో ఉన్న ఇండ్లు, భూములే తప్ప తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా చేర్చలేదని వెల్లడించారు.  వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చామన్న  ప్రచారం పూర్తిగా అవాస్తవమని,  ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎన్నడూ లేదన్నారు.  బుధవారం సెక్రటేరియెట్‌‌లోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములపై  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై చర్చించారు.  సీఎం ముఖ్య కార్యద‌‌ర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్. లోకేశ్​ కుమార్, స్టాంప్స్ , రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మేడ్చల్ -మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సీఎం ఆలోచనలకు తగ్గట్టుగా..

22ఏ జాబితా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌‌న‌‌లు, సూచ‌‌న‌‌లకు తగ్గట్టుగా  అధికారులు పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఆదేశించారు. అర్హులెవరికీ  అన్యాయం జరగొద్దని, అదే సమయంలో ప్రభుత్వ భూములు  కాపాడాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, చట్టబద్ధంగా, నిబంధనల మేరకు అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితాలోంచి ఎత్తేయాలని, వాస్తవాలు, రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా ప్రతి కేసును పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.  22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్‌‌ పెట్టకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. అలాగే నిషేధిత భూముల వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.