- అక్టోబర్ 5 నుంచి సాయంత్రం వేళల్లో తరగతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తూ తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడం రాని ఉద్యోగుల కోసం తెలుగు అకాడమీ ప్రత్యేక కోర్సును ప్రారంభిస్తోంది. పాలనలో అధికార భాషగా తెలుగును సమర్థంగా అమలు చేయాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ‘తెలుగు పరిచయ కోర్సు’ను నిర్వహించనుంది. ఎంపికైన ఉద్యోగులకు 48 పని దినాల పాటు శిక్షణ ఇస్తారు.
కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు మంగళవారం నుంచి అక్టోబర్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 5 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ కోర్సును మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలుగు అకాడమీ డైరెక్టర్ భట్టు రమేశ్ తెలిపారు.
