రవీంద్రభారతి, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలను కొడుకు, కూతురు అనే తేడా లేకుండా పెంచాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. పిల్లలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే వారు తమ లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు.
వాగ్దేవి నృత్యక్షేత్ర తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ‘నర్తన్–26’ పేరుతో రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కళాకారులతో పాఠశాలల్లో నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నవంబర్ 14 నుంచి బాలికలు, మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాగ్దేవి నృత్యక్షేత్ర మూడేళ్లుగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత, టెలివిజన్ కొరియోగ్రాఫర్ అమిత్ మాస్టర్, దూరదర్శన్ కళాకారిణి, గురువు డాక్టర్ వినీలరావు, సంస్థ ప్రతినిధులు భరత్‌కుమార్ పాల్గొన్నారు.
