షాద్ నగర్, వెలుగు: కృష్ణజింకను వేటాడి, మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్న తొమ్మిది మంది ముఠాను షాద్‌నగర్ పోలీసులు, ఎస్‌వోటీ, ఫారెస్ట్ అధికారులు కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి లైసెన్డ్స్ తుపాకీ, బుల్లెట్లు, మాంసం, రెండు వాహనాలు, నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డీసీపీ శిరీష సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
సెప్టెంబర్26న అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన 9 మంది కారులో నారాయణపేట జిల్లా మరికల్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఉదయం లెసెన్డ్స్ తుపాకీతో కృష్ణజింకను వేటాడారు. అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా నరికి ప్యాక్ చేసుకొని సోమవారం హైదరాబాద్ వస్తుండగా రాయకల్టోల్ ప్లాజా సమీపంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
విచారణలో కృష్ణజింకను తామే వేటాడినట్లు నిందితులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎండీ హాజీ ఉద్దీన్, మీర్ మక్తార్ అలీ, ఎండీ తాజుముల్, మీర్రాజా అలీ ఖాన్, ఖుర్రం ఖాన్, సయ్యద్ సల్మాన్ అలీ, ఎండీ అఫ్రోజ్ ఖాన్, ఎండీ అబ్దుల్అజీజ్, ఎండీ రియాజ్ ఉన్నారు.
నిందితుల నుంచి రైఫిల్, టెలిస్కోప్, సైలెన్సర్, 19 తుపాకీ బుల్లెట్లు, సుమారు 13 కేజీల కృష్ణజింక మాంసం, రెండు కార్లు, ఫోన్లు, రూ.28,590 నగదు, స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం- కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మీడియా సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ఎస్‌వోటీ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
