- బీజేపీతో అవగాహన వల్లే ఈడీ చర్యలు లేవా?
బషీర్‌బాగ్, వెలుగు: ప్రధానమంత్రిని కలవగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ కేసులు మాఫీ అయ్యాయా? ఆయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో బయటపెట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. పొంగులేటి ఆస్తులపై గతంలో పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ లీడర్లు ఆందోళన చేశారు. ఈడీ ఆఫీసులోకి తమను అనుమతించాలని కోరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వివేకానందగౌడ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో పోరాడుతున్నట్లు నటిస్తూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
గతంలో మంత్రి పొంగులేటి ఆస్తులపై 16 చోట్ల ఈడీ దాడులు నిర్వహించిందని, డజన్ల సంఖ్యలో కౌంటింగ్ యంత్రాలను తీసుకెళ్లి నగదును లెక్కించారని వివేకానందగౌడ్ పేర్కొన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
పొంగులేటి కొడుకు కోట్ల రూపాయల విలువైన వాచ్‌ల వ్యవహారంలో పట్టుబడినా చర్యలు లేవని ఆరోపించారు. పొంగులేటి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో కేంద్ర దర్యాప్తు సంస్థలు బయటపెట్టాలని ఎమ్మెల్యే కోరారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకోవడం వల్లే పొంగులేటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆందోళనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శాంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
