- 14 మందిపై కేసు.. ఐదు రోజులైనా అరెస్ట్ చేయని పోలీసులు
- రంగారెడ్డి జిల్లా నోములలో అమానవీయ ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: చేతబడి చేస్తూ గర్భిణులు, పిల్లల బట్టలు మాయం చేస్తోందన్న అనుమానంతో ఓ వృద్ధురాలిని ఇంట్లోంచి లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి కొంతమంది గ్రామస్తులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో ఆమె ఎడమ చేయి, కాలు విరిగాయి. అడ్డొచ్చిన కొడుకుపైనా దాడి చేయడంతో అతడి తలకు గాయమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోములలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దళితురాలు పల్లాటి వెంకటమ్మ (65)పై కొంతకాలంగా గ్రామస్తులకు మంత్రాలు చేస్తుందని అనుమానాలు ఉన్నాయి.
గ్రామంలో గర్భిణులు, పిల్లల బట్టలు మాయమవుతుండటంతో ఆమె చేతబడి చేస్తోందని భావించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 23న కొందరు ఆమెను బలవంతంగా ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి అర కిలోమీటర్ దూరంలోని పోచమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చెట్టుకు కట్టేసి చెప్పులు, కర్రలతో కొట్టారు. తనకు చేతబడి తెలియదని, బట్టలు తాను మాయం చేయలేదని వెంకటమ్మ వేడుకున్నా వదల్లేదు. దాడిలో ఆమె చేయి, కాలు విరిగాయి. విషయం తెలుసుకున్న వెంకటమ్మ భర్త పోచయ్య, కొడుకు మహేశ్ అక్కడికి చేరుకోగా వారిపైనా దాడి చేశారు. మహేశ్ తలకు గాయమైంది. అతడి కారును ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన అల్లుడిపైనా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంకటమ్మను విడిపించారు.
23నే ఫిర్యాదు.. అరెస్టులు ఎప్పుడో?
ఘటనపై బాధితురాలి కొడుకు మహేశ్ సెప్టెంబర్ 23న మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 14 మందిపై కేసు నమోదైంది. అయితే ఐదు రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు స్పందించారు. కేసు అదే రోజు నమోదైందని, ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. త్వరలో అరెస్టు
చేస్తామని చెప్పారు.
