ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు! ..ఆత్మరక్షణ కోసం ఆయుధాల ప్రతిపాదనలు :

ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు! ..ఆత్మరక్షణ కోసం ఆయుధాల ప్రతిపాదనలు :
  • ఏ స్థాయి అధికారులకు వెపన్లు ఇవ్వాలనేదానిపై కసరత్తు
  • రైడింగుల్లో ఎదురుదాడుల నేపథ్యంలో ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రక్షణపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్  రివ్యూ 

హైదరాబాద్, వెలుగ: రాష్ట్రంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎల్) స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతుండటంతో ఎక్సైజ్ శాఖను ఆయుధాలతో సన్నద్ధం చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. నిఘా పెట్టి తనిఖీలకు వెళ్లే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బందిపై స్మగ్లర్లు కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడటం, వాహనాలతో ఢీకొట్టి ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడకపోవడంతో ఎక్సైజ్ అధికారులకు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

 ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బందికి వెపన్లు సమకూర్చేందుకు ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు పంపే లక్ష్యంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ సోమవారం  సమీక్ష నిర్వహించారు. రాజధాని, శివారు ప్రాంతాల్లో విస్తరిస్తున్న క్యూర్ పరిధిలోని ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ భేటీలో ఆయుధాల మంజూరు సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా చర్చించారు. గతంలో శాసనసభ వేదికగా, సమీక్షా సమావేశాల్లోనూ ఎక్సైజ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విభాగానికి ఆయుధాలు ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించగా, తాజా ప్రతిపాదనలతో ఆ ప్రక్రియ ముమ్మరమైంది.  

అధికారుల నుంచి అభిప్రాయాల సేకరణ 

ఆయుధాల మంజూరుకు అనుమతి లభిస్తే.. ప్రాథమికంగా ఏ స్థాయి అధికారులకు వెపన్లు కేటాయించాలనే అంశంపై కమిషనర్ హరికిరణ్ క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను సేకరించారు. స్టేట్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ విభాగాలు అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో పాల్గొంటున్నందున తొలి ప్రాధాన్యతగా వారికే ఆయుధాలు ఇవ్వాలా? లేక సర్కిల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు (సీఐ), ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (ఈఎస్) స్థాయి దాకా ఇవ్వాలా? అనే విషయమై కసరత్తు చేశారు.

 ఆయుధాల నిర్వహణ, ఫైరింగ్ రూల్స్, ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అకాడమీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించే అంశాన్ని ప్రతిపాదనల్లో చేర్చనున్నారు. ఇరు శాఖల మధ్య సమాచార మార్పిడి సక్రమంగా ఉన్నప్పుడే నేరస్తులు నగర సరిహద్దులు దాటకుండా పకడ్బందీగా కట్టడి చేయవచ్చని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. 

రాబడి పెంచండి.. బకాయిలు వసూలు చేయండి 

మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్ జంట నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్), పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యూటీ పెయిడ్ మద్యం నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై నిరంతర నిఘా ఉంచాలని కమిషనర్  ఆదేశాలు జారీ చేశారు. గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి నగరానికి సరఫరా అవుతున్న సింథటిక్ డ్రగ్స్, గంజాయి మూలాలను తుదముట్టించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రవాణా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. కేవలం నేరాలను అడ్డుకోవడమే కాకుండా, శాఖాపరమైన రాబడి విషయంలోనూ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. బార్లు, మద్యం షాపుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్ రెంటల్ ఫీజులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరితగతిన రికవరీ చేయాలని ఆదేశించారు.  

కొత్త బార్ల దరఖాస్తుదారులకు గైడెన్స్ 

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యే బార్ల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. కొత్త బార్ల కోసం దరఖాస్తు చేసుకునే వ్యాపారులకు ఎలాంటి సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు, వేదికలు కల్పించాలని ఆదేశించారు.

 నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు తగిన గైడెన్స్ ఇస్తూ, లైసెన్సింగ్ ప్రక్రియలో అనవసర జాప్యం లేకుండా ఎక్సైజ్ అధికారులు సహకరించాలని సూచించారు.ఈ కీలక ఉన్నతస్థాయి సమీక్షలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ జాయింట్ కమిషనర్ జి. అంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతోపాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్లు ఏ శ్రీనివాసరెడ్డి, జే హరికిషన్​ తదితరులు పాల్గొన్నారు.