స్కూల్ నుంచే కాంపిటీషన్‌‌‌‌కు రెడీ ..మారనున్న సమ్మెటీవ్, ఫార్మెటీవ్ క్వశ్చన్ పేపర్లు

స్కూల్ నుంచే కాంపిటీషన్‌‌‌‌కు రెడీ ..మారనున్న సమ్మెటీవ్, ఫార్మెటీవ్ క్వశ్చన్ పేపర్లు

హైదరాబాద్, వెలుగు: పాఠశాల స్థాయి నుంచే స్టూడెంట్లను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ సరి కొత్త ప్లాన్‌‌‌‌ను అమలులోకి తెస్తోంది. పుస్తకాల్లోని అంశాలను బట్టీ పట్టి మార్కులు పొందే పాత పద్ధతికి చెక్ పెడుతూ.. సమ్మేటివ్  అసెస్‌‌‌‌మెంట్(ఎస్‌‌‌‌ఏ), ఫార్మేటివ్  అసెస్‌‌‌‌మెంట్(ఎఫ్‌‌‌‌ఏ) క్వశ్చన్  పేపర్లను సమూలంగా మార్చబోతోంది. 

విద్యార్థుల్లో క్రిటికల్  థింకింగ్, విశ్లేషణా నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా ‘పారఖ్  రాష్ట్రీయ సర్వేక్షణ్’ విధానానికి అనుగుణంగా సరికొత్త క్వశ్చన్  పేపర్లను తీసుకురానుంది. ఇందులో భాగంగా ఎఫ్‌‌‌‌ఏ టెస్టుల్లో ఆలోచింపజేసే పారఖ్  ప్రశ్నలు, ఎస్‌‌‌‌ఏ పరీక్షల్లో భారీ సంఖ్యలో మల్టిపుల్  ఛాయిస్  ప్రశ్నలను విధిగా చేర్చాలని నిర్ణయించింది. 

రాష్ట్రంలో ఇప్పటికే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు రెండు ఎస్ఏ, నాలుగు ఎఫ్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీఈ మెథడ్​లో చదువులు కొనసాగుతుండగా, దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో క్వశ్చన్  పేపర్లు సిద్ధం చేయడం లేదనే వాదనలున్నాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ మార్చాలని స్కూల్  ఎడ్యుకేషన్  నిర్ణయించింది. 

బడుల్లో నిర్వహించే పరీక్షల్లో పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రశ్నలను యథాతథంగా దించేసే పద్ధతి కనిపించొద్దని డిసైడ్  అయింది. విద్యార్థి చదువుకున్న పాఠ్యాంశాలు నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు ఎలా ఉపయోగపడతాయో? పరీక్షించేలా ప్రశ్నపత్రాల తయారీ జరగనుంది. విద్యార్థికి సబ్జెక్టుపై ఎంత మేరకు అవగాహన ఉంది? 

ఆ పరిజ్ఞానాన్ని విభిన్న సమస్యల పరిష్కారంలో ఎలా అప్లై చేయగలడు? అనే అంశాల ఆధారంగా విభిన్న క్లిష్టత స్థాయిలతో ప్రశ్నలు రూపొందనున్నాయి. ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డీసీఈబీ సెక్రటరీలు, అసిస్టెంట్  సెక్రటరీలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ నిర్వహించింది.