నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పట్‌పటీ తండాలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లేకపోయినా ఉన్నాయని నమ్మిస్తూ కొందరు ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా హైడోస్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గ్రామం నుంచి ఫిర్యాదులు అందాయి.
డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు వైద్యాధికారులు తాండాలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి, గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. సుమారు 25 మందికి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ టెస్టులు నిర్వహించగా.. అన్ని పరీక్షల్లోనూ అందరికీ నెగిటివ్ వచ్చింది.
గ్రామస్తులకు ఎలాంటి వ్యాధి లేకపోయినా రాకపోయినా "టైఫాయిడ్ ఉంది" అంటూ ఆర్ఎంపీలు భయపెడుతూ పేషెంట్లకు ఐవీ క్యానులా(సెలైన్ లైన్) పెట్టి, ఐదు రోజుల పాటు అనవసరమైన హైడోస్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తూ జేబులు గుల్ల చేస్తున్నారని వాపోయారు.
హైడోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ప్రాణాలకే ప్రమాదకరమని, ఆర్ఎంపీలు తమ పరిధి మేరకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని పీహెచ్ సీ డాక్టర్ సద్దాం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉజ్వల, డాక్టర్లు పాల్గొన్నారు.
