అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తవకముందే బన్నీ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఇందుకు సంబంధించి గతంలో లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఓ రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ లైవ్ స్టోరీ గురించి ఇటీవల తెలుసుకున్నానని, పదేళ్లపాటు ఖాకీచొక్కాలో సేవ చేసిన అతను.. ప్రజలకు దేవుడు ఎలా అయ్యాడు అన్నది ఆసక్తికరంగా అనిపించిందని, అతని కథతో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు లోకేష్ అందులో చెప్పారు. దీంతో బన్నీతో చేయబోయే సినిమా ఆ కాప్ స్టోరీ అయ్యుండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఖాకీ చొక్కా బన్నీకి కొత్తేమి కాదు.
గతంలో ‘రేసుగుర్రం’లో కాసేపు పోలీస్‌గా కనిపించినఅల్లు అర్జున్, ‘డీజే దువ్వాడ జగన్నాథం’లో అండర్ కవర్ కాప్‌గా నటించారు. అయితే పోలీస్ క్యారెక్టర్‌తో పూర్తిస్థాయి సినిమా చేయడం ఇదే తొలిసారి కానుంది. తన కెరీర్‌లో ఇది 23వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌కు వెళ్లనుంది.
