ఢిల్లీలో పార్కింగ్ ఫీజు డబుల్.. వింటర్ పొల్యూషన్ కట్టడికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్

ఢిల్లీలో పార్కింగ్ ఫీజు డబుల్.. వింటర్ పొల్యూషన్ కట్టడికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్
  • ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

న్యూఢిల్లీ: మూడు నెలల ముందే వింటర్ పొల్యూషన్​కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌‌ ప్రకటించింది. ఇందులో భాగంగా నగరంలో పార్కింగ్ ఫీజు డబుల్​చేయడంతోపాటు నిర్మాణ రంగ కార్యకలాపాలపై పూర్తి నిషేధం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. నవంబర్ 1 నుంచి నూతన పార్కింగ్ రేట్లు అమలులోకి రానున్నాయి. అదేవిధంగా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు ఆఫీస్ వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఆఫీసులు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయి. ఇదే కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తమ సిబ్బందిలో 50 శాతం మందితో మాత్రమే ఆఫీసుల్లో పనిచేయించాలి. 

మిగతా 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోమ్) విధులు నిర్వర్తించాలి. దుమ్ము, ధూళిని వెదజల్లే ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేత పనులకు ఈ కాలంలో పూర్తిగా కోత విధించనున్నారు. 

అయితే, గతంలో ఆడ్-ఈవెన్ విధానం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ, వాహనాల ఉద్గారాలతోపాటు దుమ్ము, ధూళి, పారిశ్రామిక వ్యర్థాలు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పంట వ్యర్థాల దహనం వల్లే ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోందని అధికారులు స్పష్టం చేశారు.