- జూన్ 22 తర్వాత పుట్టిన శిశువులకూ వర్తింపు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి అర్హత ఉన్న శిశువుకు ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరం ఇవ్వనుంది. ‘తాయ్‌మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పేరుతో ఈ పథకాన్ని సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.755.83 కోట్లు కేటాయించింది. తొలి దశలో 1.28 లక్షల ఉంగరాలను సిద్ధం చేసింది. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. ట్యాంపర్‌ప్రూఫ్ ప్యాకింగ్‌లో వాటిని అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలోనే ఉంగరం ఇవ్వనున్నారు.
సర్కారు దవాఖానల్లో ప్రసవాలకు ప్రోత్సాహంగా..
2026 జూన్ 22 తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన అర్హులైన పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల తల్లులు తమిళనాడు శాశ్వత నివాసులు అయి ఉండాలి. పీఐసీఎంఈలో నమోదు చేసుకుని, రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ఐడీ పొందాలి. గతంలో పుట్టిన పిల్లలకు ఉంగరాలు ఇచ్చేందుకు రాష్ట్రంలో 107 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో కేంద్రం రోజుకు 100 మందికి ఉంగరాలు పంపిణీ చేయనుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకు పెంచడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచడం ఈ స్కీం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఉంగరాల కొనుగోలు, వాటి భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని సూచించాయి.
