- ఢిల్లీ మంత్రి చెంపదెబ్బ ఘటనపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: రోడ్డు తనిఖీ సమయంలో ఢిల్లీ బీజేపీ మంత్రి పర్వేశ్ వర్మ ఓ యువకుడిని చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది ఓటర్లంటే ఏమాత్రం భయం లేని అధికారానికి అసలైన రూపమని మండిపడ్డారు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే కాదని.. ఇది ఒక పెద్ద రుగ్మతకు సంకేతమని విమర్శించారు. ఓట్చోరీ వల్లనే బీజేపీ నాయకులకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే ధైర్యం, అహంకారం వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఆదివారం ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో రోడ్డు నాణ్యత తనిఖీలకు వచ్చిన మంత్రి పర్వేశ్ వర్మ.. తనను వీడియో తీస్తున్న ఓ యువకుడిపై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోమవారం రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ యువకుడు చేసిన నేరం ఏంటి? అని ప్రశ్నించారు. ‘రోడ్డుపై ప్రశ్నిస్తే - చెంపదెబ్బ. నీట్ పేపర్ లీక్‌లపై ప్రశ్నిస్తే - లాఠీచార్జ్. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే - మైక్ బంద్’ ఇదీ బీజేపీ సర్కారు తీరు అని రాహుల్ మండిపడ్డారు.
ఎన్నికల్లో తమను ఎవరూ తొలగించలేరన్న ధీమాతోనే వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఓట్ల దొంగతనం కేవలం ఫలితాలనే కాకుండా, దాని తర్వాత వచ్చే అహంకారాన్ని కూడా కొనితెస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆమోదంతో సంబంధం లేదనుకునే ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరం లేదని.. అది కేవలం ప్రజల మౌనాన్ని, గుడ్డి భక్తిని మాత్రమే కోరుకుంటుందని ఆయన విమర్శించారు.
అలాగే, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాగా, రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలపై మంత్రి పర్వేశ్ వర్మ స్పందించారు. ‘రాహుల్ జీ, మీరు ఇందులో జోక్యం చేసుకోకండి.. మీకు అసలు విషయం తెలియదు’ అని అన్నారు.
