హైదరాబాద్: నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం ఉదయం నుంచి నిమ్స్ ఉద్యోగులకు చెందిన 5 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో NIMS బార్బర్ ధన్‌రాజ్ ఇంట్లో రూ.7 లక్షల నగదు గుర్తించారు. భూములకు సంబంధించిన పత్రాలపై అధికారుల ఆరా తీశారు.
నగదు లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐదు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసు విచారణలో భాగంగానే ఈ సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. లక్ష్మీభాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గత రెండు నెలల నుంచి ఏసీబీ అతనిపై నిఘా పెట్టింది.
ఆయన విధులు, ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించింది. 2007 జూన్ 10న లక్ష్మీభాస్కర్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఏసీబీ సోదాలు జరిగిన ఈ నెల 21వ తేదీ వరకు జీత భత్యాలు, ఖర్చులు లెక్కగట్టింది. ఇందులో లక్ష్మీ భాస్కర్‌కు చెందిన మొత్తం ఆదాయం రూ.2 కోట్లు కాగా.. వాటిలో మొత్తం ఖర్చు రూ. 94.33 లక్షలు- పోను రూ. 1,05,67,000 ఆదా అయ్యే అవకాశం ఉంది.
కానీ, సోదాల్లో పట్టుబడిన మొత్తం ఆస్తుల విలువ మాత్రం రూ. 2,75,95,200గా ఏసీబీ నిర్ధారించింది. ఈ లెక్కన రూ.1,70,28,200 ఆదాయానికి మించిన ఆస్తులుగా ఏసీబీ గుర్తించింది. మొత్తంగా ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన ఆస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.2,75,95,200.
కాగా.. ప్రస్తుత బహిరంగ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం మాత్రం దాదాపు రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటికి సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో అవినీతి నిరోధక చట్టం 1988 (2018లో సవరించబడినది)లోని సెక్షన్ 13(1)(బి),13(2) కింద శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది.
