అక్టోబర్ 1 నుంచి రైల్వే తనిఖీలు షురూ: ఈ తప్పు చేస్తే భారీ జరిమానా ఖాయం!

అక్టోబర్ 1 నుంచి రైల్వే తనిఖీలు షురూ: ఈ తప్పు చేస్తే భారీ జరిమానా ఖాయం!

ముంబై లోకల్ రైళ్లలో ప్రతిరోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు సెంట్రల్ రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను ఎప్పుడూ తమ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

షేర్డ్ టిక్కెట్  ఎవరు ఐడీ తేవాలి?
ఒకే టిక్కెట్‌పై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు.. తనిఖీ సమయంలో కనీసం ఒక్కసారైనా సరైన గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి. గ్రూప్ బుకింగ్‌లు, రాయితీ టిక్కెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ ఐడీ చూపించడంలో విఫలమైతే.. ఆ టిక్కెట్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ "టిక్కెట్ లేని ప్రయాణికులుగా" పరిగణిస్తారు. దీనివల్ల భారీ జరిమానాతో పాటు ఇతర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించే ఈ-పాస్ లేదా పీటీఓ ప్రయాణాలపై నిఘా మరింత కఠినతరం చేశారు. ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిందే. అంతేకాకుండా రైలు ఎక్కడానికి ముందే ఈ-పాస్ ను 'అథారిటీ టూ ట్రావెల్'గా మార్చుకోవడం అత్యవసరం. దీనిని పాటించకపోతే రూల్స్ ప్రకారం జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.

అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లపై..
కేవలం రిజర్వ్డ్,  రాయితీ టిక్కెట్లే కాకుండా.. రిజర్వేషన్ లేని సాధారణ టిక్కెట్ల మీద కూడా రైల్వే సిబ్బంది దృష్టి సారించారు. అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడికక్కడే TTE App ద్వారా టిక్కెట్ అసలైనదేనా కాదా అని తనిఖీ చేస్తారు. ఫోర్జరీ టిక్కెట్లు, నకిలీ పాస్‌ల వాడకాన్ని అరికట్టడంతో పాటు రైల్వే శాఖకు జరుగుతున్న ఆదాయ నష్టాన్ని నివారించడమే ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశం.

ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ప్రతిరోజూ ప్రయాణించే వారు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రయాణానికి ముందే మీ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను సిద్ధం చేసుకోండి. మీ టిక్కెట్ రకం ఏమిటి, దానికి ఉండే రూల్స్ ఏమిటనే దానిపై పూర్తి స్పష్టత కలిగి ఉండండి. అక్టోబర్ నెలంతా ఈ తనిఖీలు చాలా కఠినంగా జరుగుతాయి కాబట్టి.. ముందస్తు జాగ్రత్తలతో ప్రయాణాన్ని సాఫీగా మార్చుకోండి.