- ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
- ఇప్పటివరకూ 24 మంది మృతి, మరో 14 మంది గల్లంతు
ఖాట్మాండు: ప్రకృతి ప్రకోపంతో నేపాల్ మళ్లీ అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కళ్లముందే కొండలు కరిగిపోతుండటం, ఇళ్లు నేలమట్టమవుతుండటంతో స్థానికుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ముస్తాంగ్ జిల్లాలోని లేతే సమీపంలో ఆదివారం భారీగా వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో పర్వత ప్రాంతం ఒక్కసారిగా కుప్పకూలి లోయలోని కాళీ గండకి నదిలో పడిపోయింది.
ఈ దృశ్యాలను ఛార్‌ధామ్ యాత్రికులు తమ కెమెరాల్లో బంధించారు. మట్టి, రాళ్లు క్షణాల వ్యవధిలో కొండపై నుంచి జారిపడుతుండటంతో సమీపంలోని ప్రజలు భయంతో కేకలు వేశారు. కొండచరియలు పడటంతో కాళీ గండకి నది ప్రవాహం కాసేపు స్తంభించిపోయినప్పటికీ, ఆ తర్వాత నీరు తన మార్గాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగింది.
మరోవైపు కొండపై నుంచి తీసిన ఇంకో వీడియోలో నేల మొత్తం కుంగిపోయి లోయలోకి జారిపోవడం కనిపించింది. చెక్క, రాళ్లతో నిర్మించిన ఓ ఇల్లు, చెట్లతో సహా కొట్టుకుపోయింది. నిలువ నీడ కోల్పోయిన ఓ మహిళ రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
మూడు రోజులుగా భారీ వర్షాలు
గండకి ప్రావిన్స్‌లో వరుసగా 3 రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా శనివారం నుంచే కాళీ గండకి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయానికి తీవ్ర వరద ముంచెత్తింది. ముస్తాంగ్, మ్యాగ్ది నుంచి పర్బత్, స్యాంగ్జా జిల్లాల వరకు ఈ నదీ తీరప్రాంతాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. తాజాగా సంభవించిన వరదలు, కొండచరియల దుర్ఘటనల్లో ఇప్పటివరకూ 24 మంది మృతి చెందగా, మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది.
పర్బత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఏకంగా ఒక చిన్న నివాస ప్రాంతమే పూర్తిగా కొట్టుకుపోయింది. చిత్వాన్ వైపు వెళ్లే రహదారులు కొండచరియల కారణంగా మూసుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. భద్రతా దళాలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
మనాంగ్ జిల్లాలోని 7,126 మీటర్ల ఎత్తున్న హిమ్‌లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం భారీ మంచు తుపాను విరుచుకుపడింది. నార్ ఫూ ప్రాంతంలో సంభవించిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు.
