- కేంద్రం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐకు సుప్రీం నోటీసులు
- ఈ వసూలుకు ఎగ్జిక్యూటివ్ చట్టబద్ధత ఏమిటి?
- అఫిడవిట్ రూపంలో రికార్డుల్లో ఉంచాలని ఆదేశం
న్యూఢిల్లీ: రూ.2వేలు దాటిన వాణిజ్య యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుములు వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనికి గల స్పష్టమైన కారణాలు, విధివిధానాలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, ఈ ఉత్తర్వుల అమలుపై తక్షణ స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ను విధిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అంజన్‌దత్తా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వ్యాపారులపై చార్జీలు మోపడం వల్ల ఆ భారం పరోక్షంగా సాధారణ వినియోగదారులపైనే పడుతుందని, ఇది డిజిటల్ లావాదేవీలను దెబ్బతీసి మళ్లీ నల్లధనానికి దారితీస్తుందని పిటిషనర్ వాదించారు.
ఇది పన్ను కాదు.. ఫీజు కాదు: కేంద్రం
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్. వెంకట్రామన్ వాదనలు వినిపిస్తూ.. ఈ చార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ‘‘ఇది ప్రభుత్వం వసూలు చేసే పన్ను కాదు.. యూజర్ల నుంచి తీసుకునే ఫీజు కూడా కాదు. పేమెంట్ అగ్రిగేటర్లు, బ్యాంకుల మధ్య జరిగే అంతర్గత సెటిల్మెంట్ రుసుము మాత్రమే. దీని నుంచి ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాదు” అని వాదించారు.
బ్యాంకింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి అయ్యే వ్యయాన్ని భరించడానికే ఈ ఏర్పాటని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి.. ‘‘ఇది పన్ను లేదా ఫీజు కానప్పుడు, ఈ రకమైన వసూలుకు గల ఎగ్జిక్యూటివ్ చట్టబద్ధత ఏమిటి? ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 269 ఎస్‌యూ ప్రకారం వ్యాపారులు ఎలక్ట్రానిక్ పేమెంట్లను తప్పనిసరిగా అందించాలి. అలాంటప్పుడు యూపీఐ ద్వారా జరిగే బదిలీల్లో ఈ చార్జీలను ఎవరు తీసుకుంటున్నారు?”అని ప్రశ్నించారు.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, ఇది సాంకేతిక అంశాలతో కూడుకున్న వ్యవహారమైనందున పూర్తి వాస్తవాలను అఫిడవిట్ రూపంలో రికార్డుల్లో ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు కూడా నోటీసులు జారీ చేశారు.
