హుజురాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో ఆమె భర్త తన ప్రాణ స్నేహితుడినే పక్కా ప్లాన్ తో హత్య చేశాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లెకు చెందిన వడిగె రాకేశ్(32), అంబరగొండ ప్రశాంత్ సమీప బంధువులతో పాటు మంచి స్నేహితులు.
రాకేశ్ కు ప్రశాంత్ భార్యతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై పలుమార్లు కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు కావడంతో పాటు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అప్పటినుంచి ఇద్దరి మధ్య వైరం పెరిగింది. ఈక్రమంలో
ఆగస్టు 15న భీమారంలోని ఓ ఓయో హోటల్‌లో రాకేశ్, ప్రశాంత్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతరం ప్రాణ భయంతో రాకేశ్ స్వగ్రామాన్ని వదిలేసి హనుమకొండలో ఉంటున్నాడు. తన పరువు తీయడంతో పాటు కాపురంలో చిచ్చు పెట్టాడనే కారణంతో రాకేశ్ ను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి రాకేశ్‌ను నమ్మించి హుజురాబాద్‌కు రప్పించాడు. ఓ దాబాలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు.
రాకేశ్‌కు ఫుల్‌గా తాగించిన తర్వాత పెద్దపాపయ్యపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపి డెడ్‌బాడీని కెనాల్‌లో పడేశాడు. హత్య అనంతరం ప్రశాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, పోలీసులు ధ్రువీకరించలేదు. సోమవారం హుజూరాబాద్ టౌన్ సీఐ టి. కరుణాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
