ఢిల్లీ రేప్ ఘటనలపై సుమోటో కేసు.. ‘నిర్భయ’ను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు

ఢిల్లీ రేప్ ఘటనలపై సుమోటో కేసు.. ‘నిర్భయ’ను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను సీరియస్‌‌‌‌గా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది.

దీనిపై జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌‌‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సుమోటో పిల్‌‌‌‌ను వెంటనే రిజిస్టర్ చేసి విచారణకు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌‌‌‌లో 17 ఏండ్ల మైనర్ పై  జరిగిన గ్యాంగ్‌‌‌‌రేప్‌‌‌‌ ఘటనపై ధర్మాసనం సీరియస్​అయ్యింది. 

ఈనెల21న ముగ్గురు వ్యక్తులు పోలీసులుగా నటించి బస్సులో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన మీడియా కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కేవలం సెప్టెంబర్ నెలలోనే కనీసం 13 లైంగిక దాడి కేసులు నమోదైనట్లు కోర్టు దృష్టికి వచ్చింది. చట్ట అమలు, ప్రజా భద్రతా వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.

దశాబ్దం దాటినా.. వ్యవస్థల్లో మార్పు రాలే

ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై  జస్టిస్ పర్దీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు 2012లో స్వరూప్​నగర్​లో జరిగిన నిర్భయ ఘటనను మరోసారి గుర్తుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ ఘటన జరిగి దశాబ్ద కాలం దాటినా.. వ్యవస్థల్లో నిజంగా సమర్థవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఢిల్లీలోని పార్కులు, రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌‌‌‌వేలు, ఫుట్‌‌‌‌ఓవర్ బ్రిడ్జీలు మహిళలకు హైరిస్క్‌‌‌‌ ప్రాంతాలుగా మారకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా, హింస భయం లేకుండా జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది.