అర్మేనియాలో చిక్కుకున్న జగిత్యాల జిల్లా వాసి.. తినడానికి తిండి లేక అడుక్కునే దుస్థితి!

అర్మేనియాలో చిక్కుకున్న జగిత్యాల జిల్లా వాసి.. తినడానికి తిండి లేక అడుక్కునే దుస్థితి!

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ నిరుపేద బతుకు రోడ్డున పడింది. బ్రతుకుదెరువు కోసం వెళ్తే.. ఏజెంట్ల మోసంతో నరకం అనుభవిస్తున్నాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విదేశాల్లో పడుతున్న అష్టకష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

జగిత్యాల జిల్లా చొప్పదండి  మల్యాల మండలానికి చెందిన గంగకిషన్ ఉపాధి కోసం ఆశలతో అర్మేనియా దేశానికి వెళ్లాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అర్మేనియాకు పంపించడమే కాకుండా.. అక్కడి నుంచి రష్యాకు పంపిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అర్మేనియాలో అడుగుపెట్టినప్పటి నుంచి గంగకిషన్‌కు కష్టాలు మొదలయ్యాయి. దొంగలు తన దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది.

కనీసం తినడానికి తిండి కూడా లేక.. ఎవరైనా పెడితే తింటూ రోజులు వెళ్లదీస్తున్నానని గంగకిషన్ కన్నీటి పర్యంతమయ్యాడు. బతకడం కోసం షాపుల వద్ద అడుక్కునే దుస్థితి ఏర్పడిందంటూ అతడు కన్నీరుమున్నీరవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కడి మోసగాళ్ల చేతిలో నలిగిపోతున్న తనను ఎలాగైనా ఆదుకుని, సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని మల్యాల వాసి గంగకిషన్ స్థానిక  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వీడియో ద్వారా కన్నీటితో విజ్ఞప్తి చేశాడు.