ముంబై: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానంతో గడ్కరీ కుటుంబానికి సంబంధం ఉందంటూ, దీనివల్ల వారు అక్రమంగా లాభపడ్డారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం వైరలైంది. అయితే, ఇథనాల్ పాలసీకి తన రోడ్డు రవాణా శాఖకు నేరుగా సంబంధంలేదని ఆయన స్పష్టంచేశారు.
దురుద్దేశపూర్వకంగా రూపొందించిన ఈ డిజిటల్ కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గడ్కరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియాలో ఉన్న ఈ మెటీరియల్ ఆయన పరువుకు నష్టం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించింది.
