దాక్కోకండి.. పార్లమెంట్‌‌‌‌లో సమాధానం చెప్పండి..అమిత్ షాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు

దాక్కోకండి.. పార్లమెంట్‌‌‌‌లో సమాధానం చెప్పండి..అమిత్ షాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు
  •     పార్లమెంట్ కాంప్లెక్స్‌‌‌‌లో  ప్రతిపక్షాల మార్చ్

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి సమాధానం చెప్పకుండా దాక్కోవద్దని..పార్లమెంట్‌‌‌‌ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. సభలో అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై చర్చ జరగాలని, అలాగే జమ్మూకాశ్మీర్‌‌‌‌కు వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరారు. 

బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌‌‌‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు అనేక మంది ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు మార్చ్ చేశారు. అమిత్ షా పార్లమెంట్‌‌‌‌కు రాకుండా దాక్కుంటున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై స్పందించడానికి అమిత్ షాకు భయమెందుకని ప్రశ్నించారు. అమిత్ షా ఏమైనా చెవిటివారా, మూగవారా అని ప్రశ్నించారు.ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని సూచించారు.  పేపర్ లీక్ ఆందోళనల సమయంలో విద్యార్థులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం, పెల్లెట్ గన్లతో దాడి చేయమని పోలీసులను ఎవరు ఆదేశించారని రాహుల్ గాంధీ నిలదీశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారని.. లాఠీచార్జ్ కూడా చేశారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు. ఇలా చేయాలని పోలీసులను ఆదేశించనవారే సమాధానం తప్పకుండా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నియంతృత్వ పాలన కాదని.. స్టూడెంట్లపై దాడికి బాధ్యులైనవారు స్పందించాల్సిందేనని తేల్చిచెప్పారు. 

విరాళాల డబ్బాలతో నిరసన

రామమందిర విరాళాల్లో గోల్‌‌‌‌మాల్ జరిగిందని ఆరోపిస్తూ ఎంపీలు మకర్ ద్వార్ మెట్ల వద్ద విరాళాల డబ్బాలను ఉంచి ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. 'చందా చోర్' అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఎంపీలు కోరారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు పార్లమెంట్‌‌‌‌లో తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అణచివేత ధోరణిని ప్రజల ముందు ఎండగడతామని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు.