- ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కాళ్లు మొక్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకే పోస్టులో ఏడేండ్ల పాటు కొనసాగారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం గాంధీ భవన్‌లో సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బీఎస్‌పీ పార్టీని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని, కల్వకుంట్ల కుటుంబ మాయ మాటల మత్తులోపడి ఆర్‌ఎస్ ప్రవీణ్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయన జాతి ద్రోహి అని మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు జవాబులు ఇవ్వకుండా హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించడం ఏమిటని ఫైర్ అయ్యారు. తమ ఆరోపణలు అబద్ధమైతే ఆధారాలు బయటపెడ్తామని స్పష్టం చేశారు.
