ఆదిలాబాద్, వెలుగు: కనకదుర్గ చిట్‌ఫండ్స్‌లో డబ్బులు కట్టి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో ఉమ్మడి జిల్లాకు చెందిన దాదాపు 93 మంది బాధితులకు రావలసిన రూ.2,34,59,991 విలువైన చెక్కులను బుధవారం అందజేశారు. గతంలో కనకదుర్గ చిట్‌ఫండ్స్ యాజమాన్యం బాధితులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో, ఆదిలాబాద్ టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. దీంతో బాధితులందరికీ చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అతను అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, టూ టౌన్ సీఐ కె.నాగరాజు, చిట్‌ఫండ్స్ ఎండీ తిరుపతి రెడ్డి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
